కరీంనగర్ : రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రద్దు చేస్తామన్న వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ ( BRS )శ్రేణులు నిరసన చేపట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రేవంత్ (Reventh Reddy) మాట్లాడిన ప్రతీ మాటలు చంద్రబాబు (Chandra Babu ) మాట్లాడించినవేనని ఆరోపించారు. గురు శిష్యులిద్దరూ ఇంకా తెలంగాణ పై విద్వేషాన్ని చిమ్ముతూనే ఉన్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్(Congress) హయాంలో మూడు గంటల కరెంట్ ఇచ్చినప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తామని చెప్పకనే చెబుతున్నారని విమర్శించారు.అలాంటి కాంగ్రెస్‌కు మూడు సీట్లు కూడా ఇవ్వొద్దని రైతులను కోరారు. పక్కరాష్ట్రాలకు తెలంగాణ కరెంట్ తరలించేందుకు కాంగ్రెస్ సిద్దమైందని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ లో గుడ్డి దీపాలే దిక్కు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలించే కర్ణాటక (Karnataka) లో ఇచ్చిన హామీ అమలు చేసే దమ్ము లేక తెలంగాణ రాష్ట్రాన్ని బియ్యం అడిగారని గుర్తు చేశారు. కర్ణాటక లో కరెంట్ కూడా సరిపడా ఇవ్వడం లేదని దుమ్మెతిపోశారు.ఓవైపు బీజేపీ వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే మరోవైపు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దని కాంగ్రెస్ అంటుందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదగాలని 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) కే దక్కుతుందని వెల్లడించారు.
స్వరాష్ట్రంలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారని వివరించారు. దేశానికి వెన్నెముకైన రైతును రాజు చేయాలని రైతు సంక్షేమం కోసం 30 వరకు పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. .రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం, మిషన్ కాకతీయ ఇలా పలు రకాల రైతు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి తెలిపారు.