Gruha Lakshmi | కరీంనగర్ : రాష్ట్రంలోని నిరుపేదలకు గూడు కల్పించేందుకు కేసీఆర్ సర్కార్ గృహలక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సొంత జాగ ఉండి.. ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఈ పథకం కింద రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే గృహలక్ష్మి పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారమ్స్ అని పేర్కొంటూ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో రెండు, మూడు రకాల ఫారమ్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ దరఖాస్తు ఫారాలపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.
గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాన్ని అమలు చేస్తామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గృహలక్ష్మి కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ అంటూ ఏది లేదని.. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫారమ్స్తో ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన వారు తెల్లకాగితంపై రాత పూర్వకంగా దరఖాస్తు రాసిచ్చినా సరిపోతుందన్నారు. ఆహార భద్రత కార్డు(రేషన్ కార్డు), ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డును జతపరిచి, స్థానిక తహసీల్దార్‌కు సమర్పించాలని సూచించారు. ఆ తర్వాత తహసీల్దార్లు కలెక్టర్లకు సమర్పిస్తారని చెప్పారు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కానీ, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ లేకపోయినా, ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.