కరీంనగర్ : బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమేనని… వీలైనంత త్వరగా భారతదేశ పగ్గాలను సీఎం కేసీఆర్ చేపట్టాలని.. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. ప్రపంచం నివ్వెరపోయేలా సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మంత్రి తెలిపారు.
కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే సత్తా కేవలం కేసీఆర్‌కే ఉందని చెప్పారు. ప్రపంచం నివ్వెరపోయేలా తెలంగాణాను అభివృద్ది చేశారని కొనియాడారు. 70 సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వానికి కాళేశ్వరం గుర్తుకు రాలేదాన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ అభివృద్దిని చూసి ప్రశంసిస్తున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి ఆయుధం దేశానికి కావాలంటూ ప్రజలు కోరుతున్నారని తెలిపారు. భారత దేశ ప్రజలకు కేసీఆర్ సేవలు అవరసమని… వీలైనంత త్వరగా సీఎం కేసీఆర్ భారతదేశ పగ్గాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో దేశ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. రాష్ట్రం అధోగతి పాలవుతున్న సమయంలో ప్రజల గొంతుకగా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు. దేశ ప్రజలందరి గొంతుక కేసీఆర్ అని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి గంగులతో పాటు మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.