మెదక్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ పాలనలో మున్నూరుకాపులకు తగిన గుర్తింపు, సముచిత స్థానం దక్కిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలోని వేంకటేశ్వర ఫంక్షన్హాల్లో మున్నూరుకాపు కృతజ్ఞత సభకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి గంగుల పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల మాట్లాడుతూ..తెలంగాణలో మున్నూరుకాపులను రాజకీయంగా గుర్తించి, ఆదరించింది సీఎం కేసీఆరేనని కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో మున్నూరు కాపులను ఏ పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని కోకాపేట నడిబొడ్డున ఐదు ఎకరాల భూమిని మున్నూరు కాపులకు ఇచ్చారని, ఇప్పుడు దాని విలువ రూ.500 కోట్లు ఉంటుందని తెలిపారు.
తెలంగాణ వచ్చాక హైదరాబాద్ మొదటి మేయర్ మున్నూరు కాపు ముద్దుబిడ్డ బొంతు రామ్మోహన్‌ను నియమించగా, రెండోసారి మున్నురుకాపు బిడ్డకే ఇచ్చిన విషయాన్ని మం త్రి గుర్తుచేశారు. ఆర్టీసీ చైర్మన్ పదవిని సత్యనారాయణకు ఇచ్చారని, మంత్రి పదవులను జోగు రామన్నతోపాటు తనకు ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే తెలంగాణ అంధకారం అవుతుందని హెచ్చరించారు.