కరీంనగర్ : ‘కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అని చావునోట్లో తలపెట్టి తెచ్చిన తెలంగాణను అదే రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈటల రాజేందర్ నిర్లక్ష్యంతో 20 ఏండ్లుగా వెనుకబడ్డ హుజురాబాద్ పట్టణాన్ని రూ. 50కోట్ల నిధులతో అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజలు, కులసంఘాల నేతలు, ఆటో యూనియన్ వాళ్లే స్వచ్ఛందంగా డబ్బులు జమ చేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ ఫీజు కడుతున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ విజయం ఖాయమైందన్నారు.
శుక్రవారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి హుజురాబాద్ ప్రజల్ని మార్నింగ్ వాక్‌లో కలిశారు మంత్రి గంగుల. పట్టణ వీధుల్లో తిరుగుతూ వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. దుకాణాలు, సెలూన్లు, చిరువ్యాపారులు, వాకర్లతో కలిసి ముచ్చటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఎంతుకు మద్దతిస్తున్నారో, హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఎందుకు అవసరమో వివరించారు. గతంలో ఇక్కడ సరైన రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, ఆరోగ్య వసతులు, కమ్యూనిటీ హాళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఈ సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లగానే నిధులు విడుదల చేశారని చెప్పారు. ప్రస్తుతం రూ. 50కోట్ల నిధులతో సీసీరోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, కులసంఘాలకు ఆత్మగౌరవం భవనాలు నిర్మిస్తున్నారని చెప్పారు.
ఈ అభివృద్ధి మళ్లీ కుంటుపడకుండా ఉండాలంటే కారుగుర్తుకు ఓటేసి, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలన్నారు. రాబోయే రోజుల్లోహుజురాబాద్ అభివృద్ధి బాధ్యత తనదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కుమార్ యాదవ్, గొస్కుల రాజు, టీఆర్ఎస్ నాయకులు గందే శ్రీనివాస్, ప్రతాప కృష్ణ, బీఎస్ ఇమ్రాన్, గఫార్, ములుగు శ్రీనివాస్, అనిల్, రమేష్ యాదవ్, రాజు, సతీశ్, రమేశ్‌రాజు తదితర నేతలతో పాటు, స్థానికులు పాల్గొన్నారు.