హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనులపై హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హెచ్ఎండీఏ, బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ఈ నెలాఖరునాటికి అన్ని భవనాల టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీసీలపై ఆపేక్షతోనే కోకాపేట, ఉప్పల్‌భగాయత్ లాంటి ప్రాంతాల్లో వేల కోట్ల విలువ చేసే 87.3 ఎకరాల భూమిని, రూ.95.25 కోట్ల నిధులను 41 బీసీ సంఘాలకు సీఎం కేసీఆర్ కేటాయించారని గుర్తు చేశారు.
వాటిలో ఆయా కులాల ఆత్మగౌరవం ప్రతిఫలించేలా భవనాలను నిర్మించుకొనే బాధ్యతలను సైతం కుల సంఘాల ట్రస్టులకే అప్పగించారని, ఇప్పటికే 13 సంఘాలు సొంతంగా భవానాన్ని నిర్మించుకుంటున్నాయని చెప్పారు. మిగతా భవనాలను ప్రభుత్వమే నిర్మిస్తున్నదని తెలిపారు. వాటిలో ఇప్పటికే 10 ఎకరాలు 10 కోట్లతో యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలను కోకాపేట్లో తీర్చిదిద్దామని, అవి తుదిదశలో ఉన్నాయని, మరో 3 సంఘాల భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచామని, మిగతా 18 సంఘాలకు సైతం నెలాఖరులోపు టెండర్లు ఖరారు చేయాలని అదేశించారు.
ఆత్మగౌరవ భవన నిర్మాణాలను సైతం మార్చి నుంచి ప్రారంభించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. హెచ్ఎండీఏ ఇప్పటికే కోకాపేట, ఉప్పల్‌భగాయత్‌లో అభివృద్ధి పనులను చేపట్టిందని, కోకాపేట్‌లోని ప్రతీ ఆత్మగౌరవ భవనానికి అప్రోచ్ రోడ్లు, తాగునీరు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాల్ని కల్పిస్తున్నదని తెలిపారు.