కరీంనగర్ కార్పొరేషన్, మే 21: కరీంనగర్లో టీటీడీ సహకారంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి సోమవారం ఉద యం భూకర్షణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గర్భాలయం నిర్మించే ప్రాంతాల్లో శుద్ధి కార్యక్రమాలు చేపడతారని, దీన్ని తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్లోని కేసీఆర్ సర్క్యూట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ వాస్తుశాస్త్ర సలహాదారులు మోహనరంగా ఆచార్యులతో కలిసి మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో కరీంనగర్ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. టీటీడీ రాష్ట్ర రాజధానిలో మాత్రమే ఒక ఆలయాన్ని నిర్మిస్తుందని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో టీటీడీ ఆలయం ఉన్నదని, సీఎం కేసీఆర్ వినతి మేరకు టీటీడీ కరీంనగర్లోనూ నిర్మిస్తున్నదని అన్నారు.
ఈ నెల 31న ఉదయం 6.50 నుంచి 7.20 గంటల మధ్యలో టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేస్తామని, దీనికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి జేఈవోలు, వేదపండితులు హాజరవుతారని వెల్లడించారు. ఈ ఆలయాన్ని ఏడాదిన్నరలోగానే పూర్తి చేసి గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అదే రోజు సాయంత్రం శ్రీవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ పవిత్ర కార్యంలో కరీంనగర్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆలయం మొత్తం రాతి కట్టడంతో ఉంటుందని, ఈ రాయిని తమిళనాడు నుంచి తీసుకువస్తామని తెలిపారు. తిరుమల తిరుపతి తరహాలో వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని, ఆ ప్రకారమే ఇకడి ఆలయంలో స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తారని చెప్పారు. గర్భాలయంతోపాటు ఇందులో ఉన్న బావిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అలాగే ఇతర అన్ని సదుపాయాలు ఉండేలా సుందరంగా పనులు చేపడుతామని వివరించారు.
భక్తులను రక్షించేందుకే తిరుమలలో శ్రీవారు
కలియుగంలో భక్తులను రక్షించేందుకే శ్రీవారు తిరుమలలో వెలిశారని తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. స్వామి వారి అనుగ్రహం ఉండటం వల్లే కరీంనగర్లో ఆల య నిర్మాణ పనులు మొదలయ్యాయని అన్నారు. తిరుమల తిరుపతి క్షేత్రంలో మాదిరిగానే ఇక్కడా కైంకర్యాలతో సేవలను చేపడుతామని తెలిపారు.