జనగామ : వైద్య విద్యార్థిని(Medico Student) ప్రీతి మరణం ఆ కుటుంబానికి తీరని లోటని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli ) అన్నారు. ప్రీతి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జనగామ జిల్లా(Janagama) పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం మొండ్రాయి సమీపంలోని గిర్ని తండాలో ప్రీతి ఇంటికి మంత్రి శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
‘ ప్రభుత్వం, సొంతంగా ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రీతి మరణంపై రాజకీయాలు చేయడం కాదు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ముఖ్యం. ఆదిశగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్(CM KCR and Minister KTR) ఆలోచిస్తున్నారని ’ వెల్లడించారు. విచారణ జరుగుతున్న తీరు, వస్తున్న నివేదికల ఆధారంగా త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం గ్రామస్థులతో మంత్రి మాట్లాడారు. ప్రీతి మరణం ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు. బాగా చదువుకొని, డాక్టర్ గా ఎదిగిన బిడ్డ చనిపోవడం ఆ తల్లిదండ్రులకు తీరని కడుపుకోతని అన్నారు. ప్రీతి మరణాన్ని కొందరు ఇంకా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడుదామని అన్నారు.ప్రీతి కుటుంబంలోని సభ్యులకు ఉద్యోగపరమైన అవకాశాన్ని కూడా ఆలోచిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ప్రీతి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.