పాలకుర్తి( జనగామ) : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రగతిని ప్రారంభించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి(Palle Pragathi) దినోత్సవాన్ని పాలకుర్తి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.
వరంగల్ జిల్లా పర్వతగిరిలో, పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం పెరికేడు, గట్టికల్ గ్రామాల్లో జరిగిన పల్లె ప్రగతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో నిర్వహించిన సభల్లో మంత్రి మాట్లాడారు.

గ్రామాల అభివృద్ధే(Village Development) దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించి గ్రామాల పరిశుభ్రత, స్వచ్ఛతే లక్ష్యంగా దశలవారీగా పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం, మురుగు కాల్వలను శుభ్రపరచడం,ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ(Nursery), డంపింగ్యార్డు(Dumping Yard)ల్లో పిచ్చి మొక్కలు తొలగింపును చేపట్టిందన్నారు. వైకుంఠధామాల నిర్మాణం,వెజ్,నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలతో పల్లెలు పరిశుభ్రతతో కనిపిస్తున్నాయని వెల్లడించారు.
పల్లె ప్రగతి కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 13,528 కోట్లను ఖర్చు చేసి గ్రామాలను అభివృద్ధి చేశామని తెలిపారు. సమగ్ర గ్రామీణ అభివృద్ధి కోసం నూతన పంచాయతీ రాజ్ చట్టం అమలు చేస్తున్నామని వివరించారు. ప్రతి ఇంటికి శుద్ధిచేసిన మంచి నీటిని సరఫరా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రఫూల్ దేశాయి, జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.