పాలకుర్తి రూరల్(జనగామ) : అభివృద్ధి పట్టని కాంగ్రెస్, బీజేపీలు సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గు చేటని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar rao) అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా(Decade Celebrations)ల్లో భాగంగా మంగళవారం తెలంగాణ విద్యా దినోత్సవాన్ని(Education Day) నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో బాలుర డిగ్రీ కళాశాలను, డిజిటల్ తరగతులను కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ (CM KCR)పాలనలో విద్యా రంగం లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఈ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ విద్య ఉందన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలన లో జిల్లాకు వైద్య , వ్యవసాయ, డిగ్రీ, జూనియర్, సాంఘిక సంక్షేమ జూనియర్ డిగ్రీ కళాశాలలు వచ్చాయన్నారు.
60 ఏళ్ల కాంగ్రెస్ ,బీజేపీ పాలన లో రాష్ట్రం వెనుకబడిపోయిందని అన్నారు. పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలు విశ్లేషించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీల నాయకుల మాటలు పట్టించుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,ఆర్సీవో మనోహర్‌రెడ్డి, డీసీవో అనిత, కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, డీపీవో రంగాచారి, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, డీఈవో కేలోత్ రామూనాయక్ తదితరులు పాల్గొన్నారు.