పాలకుర్తి(జనగామ) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. జనగామ జిల్లా తొర్రూరు, పాలకుర్తిలో నిర్వహించిన మహిళ సంక్షేమ దినోత్సవంలో మంత్రి మాట్లాడారు. స్వరాష్ట్రంలో మహిళా సంక్షేమానికి స్వర్ణయుగం వచ్చిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) మహిళల పక్షపాతి అని పేర్కొన్నారు.
మహిళ సంక్షేమంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర ప్రగతికి గుర్తులని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని వెల్లడించారు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని వివరించారు. మహిళలకు స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్లు (Womens reservations)అమలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
ఆడపిల్ల పెండ్లి కోసం ఆర్థిక భారంతో కుంగిపోయే నిరుపేద కుటుంబాలను కల్యాణలక్ష్మి (Kalyana Laxmi)పథకాన్ని, మైనారిటీలకు షాదీముబారక్ ద్వారా ఆదుకుంటున్నారని తెలిపారు. 2014 నుంచి 2023 మే వరకు 12,71,839 నిరుపేద కుటుంబాలకు ఈ పథకాల కింద్ర రూ.11,130 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. మహిళలు, తల్లీ బిడ్డల సంక్షేమమే సమాజ ప్రగతికి తొలి మెట్టని పేర్కొన్నారు. బ్యాంక్ లింకేజ్ రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. లైంగిక వేదింపులు, వర కట్న బాధిత మహిళలకు సహాయ సేవలను గాను సఖి కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.
అంగన్వాడీలకు వేతనాల పెంపు
అంగన్వాడీ టీచర్ తెలంగాణకు ముందు రూ.4200 నెలకు ఉండగా ప్రస్తుతం రూ.13,850 , అంగన్వాడీ హెల్పర్‌కు రూ. 2,200 నుంచి ప్రస్తుతం రూ.7,800 నెలకు అందజేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. పాలకుర్తిలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఒంటరి మహిళలకు, కిడ్నీ, బోధకాలు, ఎయిడ్స్ బాధితులకు కూడా పెన్షన్లు ఇస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తా నియా, వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి,మూడు జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా కుట్టుమిషన్లు, డ్వాక్రా సంఘాలకు రుణాలు అందజేశారు.