హైదరాబాద్ : ఓ సామాన్యుడి సృజనాత్మకతకు అబ్బుర పడిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అతడిని వెన్నుతట్టి పోత్సహించారు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి కోసం రాసిన పాటను ప్రత్యేకంగా రూపొందింప చేసి, విడుదల చేశారు. మంత్రి దయాకర్ రావు, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు శుభ ఆశీస్సులతో.. ఎనుగొండ లక్ష్మీ నరసింహా రెడ్డి నిర్మించిన ‘శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి నమామి..భక్త జన గుండెల్లో సదా నీ పేరే స్మరామి’ అనే వీడియో సాంగ్‌ని మంత్రి ఎర్రబెల్లి బంజారాహిల్స్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎంతో భక్తశ్రద్ధలతో బొల్లికొండ సంపత్ రాయగా.. ప్రముఖ గాయకుడు ధనుంజయ్ పాడిన ఈ పాట ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా ఉందన్నారు. సూక్ష్మంలో మోక్షంలా పాట స్వామి వారి భక్తులకు నచ్చే విధంగా ఉందని, చిత్రీకరణ కూడా బాగుందని మంత్రి ప్రశంసించారు. ఈ వీడియో సాంగ్‌ని రూపొందించిన లక్ష్మీ నరసింహా రెడ్డి బృందాన్ని మంత్రి అభినందించారు. కాగా, మంత్రి ఔదార్యానికి రచయిత సంపత్ కృతజ్ఞతలు తెలిపారు.