పాలకుర్తి నియోజకవర్గంలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. పాలకుర్తి లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి పర్యాటక ప్రాంత అభివృద్ధి పనులపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు.
పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న పర్యాటక ప్రాంతాలైన బమ్మెర పోతన, పాల్కురికి సోమన, వల్మిడి వాల్మీకిలలో దేవాలయాల అభివృద్ధి కి 22.50 కోట్లతో పనులు చేపట్టగా, వాటి పురోగతిని మంత్రి దయాకర్‌రావు సమీక్షించారు. అదనంగా మరో రూ.15 కోట్లు మంజూరు కావడంతో పర్యాటక ప్రాంతాల్లోని ఆర్చ్‌లు, దేవాలయ ప్రాంగణాలు, అనుబంధంగా ఉన్న సమీప అభివృద్ధి పనులను పురాతన సంస్కృతి ఉట్టిపడేలా చేపట్టాలని సూచించారు. రాతితో పనులు చేపడితేనే సుందరంగా ఉంటాయని, సిమెంట్తోకూడిన ప్లాస్టరింగ్ పనులు చేయవద్దన్నారు.
మండలంలో ప్రధానమైన, ప్రాముఖ్యత గల ప్రదేశాల లింక్ రోడ్స్ కు ప్రతిపాదనలు అందజేయాలని మంత్రి దయాకర్‌రావు ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసుకునేందుకు నిధులున్నాయని, ఈ మేరకు ప్రణాళిక రూపొందించాలన్నారు. పాలకుర్తి సోమన ఆలయం పనులు మహా శివరాత్రి వరకు కొంతమేర పూర్తయ్యాయని, మిగిలిన పనులపై శ్రద్ధ పెట్టాలన్నారు. పనుల పురోగతిని వివరించేందుకు ఇన్చార్జీలను నియమించారు.