హైదరాబాద్ : పేద మహిళలకు ఆర్ధికంగా తోడ్పాటు అందించి, వారిని సంపన్నులుగా చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని, ఈ లక్ష్యంతోనే స్త్రీ – నిధి మరింత సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మహిళల ఆర్ధిక సాధికారతకు భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్త్రీ- నిధి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, రాష్ట్రంలో మహిళల ఆర్ధిక సాధికారత స్త్రీ – నిధి వల్ల పెరిగిందన్నారు.
రాష్ట్రంలోని స్త్రీ- నిధి కొన్ని జిల్లా సమాఖ్యల అధ్యక్షులు, బ్యాంక్ డైరెక్టర్లు నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిషత్ లోని మంత్రి కార్యాలయంలో మంత్రి దయాకర్ రావుతో సమావేశమయ్యారు.

స్త్రీ – నిధి బ్యాంకు చేస్తున్న పనులను, భవిష్యత్ ఆలోచనలను మంత్రికి వివరించారు. మహిళల ఆర్ధిక క్రెడిట్ ఆధారంగా ప్రతి మహిళకు రూ. 3 వేల నుంచి రూ. 3 లక్షల వరకు రుణం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 5.5 లక్షల స్వయం సహాయక సంఘాలలో 56 లక్షల మంది మహిళలు ఉన్నారని తెలిపారు. రుణాలు అందించడంలో, ఆర్ధిక చేయూతను అందించడంలో మరింత శక్తివంతంగా పనిచేసేందుకు స్త్రీ – నిధి రుణాలు మరింత పెంచాలని మంత్రిని కోరారు.
స్త్రీ – నిధి బ్యాంకు చేస్తున్న సేవల నేపథ్యంలో దీనిని బ్యాంక్‌గా పూర్తి స్థాయిలో తీర్చిదిద్ది, లబ్దిదారులకు మరింత చేరువ చేసేందుకు జిల్లా స్థాయిలో బ్రాంచీలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. గ్రామ స్థాయి, మండల సమాఖ్యల పదవీకాలాన్ని ఐదేండ్లకు పెంచాలని కోరారు. వడ్డీలేని రుణాల మరింతగా పెంచాలని, మహిళా సాధికారతను పెంపొందిస్తున్న స్త్రీ – నిధిని ప్రోత్సహించాలన్నారు.
స్త్రీ – నిధి వల్ల మహిళల్లో ఆర్ధిక స్వావలంభన పెరిగిందని, స్త్రీ – నిధిని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు చేపడుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా వారి ఆర్ధిక స్వాతంత్య్రాన్ని పెంపొందించేందుకు అత్యధిక స్థాయిలో రుణాలు ఇస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని కోరారు.
ఈ సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ సుల్తానియా, స్త్రీ – నిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యా సాగర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.