హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో కేంద్ర జాప్యం చేస్తుందని నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల కక్ష పూరితంగా వ్యవహరించడం వల్లనే గ్రామ పంచాయతీలకు నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందని స్పష్టం చేశారు. కేంద్రం నిధులు విడుదల చేయకున్నా.. త్వరలో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తామని మంత్రి దయాకర్ రావు స్పష్టం చేశారు.
సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహారెడ్డి నేతృత్వంలో పలువురు సర్పంచ్‌లు బంజారాహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రికి బుధవారం వినతి పత్రం సమర్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా నిధులను విడుదల చేస్తుందని, అయితే కేంద్రం మాత్రం రాష్ట్రానికి సహకరించడంలేదని మంత్రి తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు మారడానికి సీఎం కేసీఆర్ సంకల్పమే కారణమన్నారు. గ్రామాలకు రాష్ట్రం నిధుల విడుదల చేయడం వల్లనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. త్వరలోనే నిధులు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, సర్పంచులు రాములు నాయక్, కరుణాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, బాలయ్య, శ్రీనివాస్ యాదవ్, బాలసుందర్ రెడ్డి తదితరులున్నారు.