వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఈగను కూడా వాలనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ వెంటే మొత్తం తెలంగాణ ప్రజానీకం ఉందన్నారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన ఆ కుటుంబం కోసం ఏ త్యాగానికైనా పార్టీ మొత్తం సిద్ధంగా ఉందని తేల్చిచెప్పారు. మచ్చలేని కేసీఆర్ కుటుంబంపై బీజేపీ విషం చిమ్ముతుందని మండిపడ్డారు. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగనీయమని హెచ్చరించారు. కల్వకుంట్ల కవిత కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లా సంఘీభావంగా ఉందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, వరంగల్ మహానగర మేయర్ వరంగల్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ తదితరులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్ హన్మకొండలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను ఇరికించాలనుకోవడం సరికాదన్నారు. కవిత జోలికి వస్తే యావత్ తెలంగాణ కన్నెర్ర చేస్తుందని హెచ్చరించారు. కవిత ఇంటిపై బీజేపీ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు దయాకర్ రావు పేర్కొన్నారు. మొన్న పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పులలో బండి సంజయ్ బౌన్సర్లు, గూండాలు టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారు. ఇవాళ జనగామ జిల్లాలో విధ్వంసం సృష్టించడానికి బండి సంజయ్ కుట్ర పన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయమని బీజేపీ వాళ్ళను రెచ్చగొట్టి, ఉసి గొల్పాడు. చివరకు పోలీసులనే బెదిరించి, రౌడీయిజానికి దిగాడు. పోలీసులను బెదిరిస్తే వాళ్ళు ఊరుకుంటారా? చట్టం ఎవరికీ చుట్టం కాదు… తన పని తాను చేసుకుపోతున్నదని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
దేశంలో మోదీ, అమిత్ షాల అరాచకాలకు హద్దు లేకుండా పోతోందన్నారు. వారిని ప్రశ్నిస్తున్నందుకే… సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై బీజేపీ దాడులకు దిగుతున్నదని తెలిపారు. మోడీ, అమిత్ షాలపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గర పడ్డాయి. మీ లాంటి చిల్లర రాజకీయాలకు కేసీఆర్ భయపడరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.