కేసముద్రం, డిసెంబర్ 4: పేదల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, ప్రభుత్వాన్ని విమర్శిస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిధిలోని ఇనుగుర్తి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ఆదివారం ప్రారంభించారు. ఆంధ్రలో అన్న జగన్ వదిలేస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ చెల్లి షర్మిల తెలంగాణలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రజల పోరాటాన్ని రాజశేఖర్‌రెడ్డి అడుగడుగునా అడ్డుకొని హేళన చేశారని గుర్తు చేశారు. ప్రజలు మానుకోట రాళ్లను ఇంకా మరిచిపోలేదని, మళ్లీ వాటికి పని చెప్పాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బావుల మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నదని, సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్నంత వరకు అది సాధ్యపడదని, రైతులు అధైర్యపడొద్దని సూచించారు. మోదీ మాట వినని వారిపై, ప్రజల్లో బలం ఉన్న నాయకులపై ఐటీ దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు.
పరిపాలనను వేగవంతం చేసి, జవాబుదారీతనం పెంచేందుకు సీఎం కేసీఆర్.. కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామాలను ఏర్పాటు చేశారని చెప్పారు. అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఇనుగుర్తిని మండల కేంద్రంగా చేశామని పేర్కొన్నారు. 37 ఏండ్ల కల సాకారం చేసిన సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీలు మాలోతు కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.