యాదాద్రి, అక్టోబర్ 10: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి నిత్యోత్సవాలు పంచరాత్రగమశాస్త్రరీతిలో జరిగాయి. స్వామి, అమ్మవార్లను తెల్లవారుజామున సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి సుదర్శన నారసింహహోమం ఘనంగా జరిపారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు.
స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు. వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. సాయంత్రం తిరువీధిసేవ, దర్బార్ సేవ నిర్వహించారు. కాగా, లక్ష్మీనరసింహస్వామిని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. పశ్చిమ దిశలో ఉన్న వేంచేపు మండపంలో భక్తులతో కాసేపు ముచ్చటించారు. స్వామివారిని 15 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.51,13,569 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు.