వరంగల్, మార్చి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బెదిరించడం, వేధించడం, కేసుల్లో ఇరికించడం.. బీజేపీ విధానమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను బద్నాం చేయాలని కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా భయపడబోమని స్పష్టంచేశారు. డైరెక్ట్‌గా బీఆర్ఎస్ను తెలంగాణలో ఎదుర్కోలేక కేంద్రం ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిందని, బీజేపీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని కేసులతో లొంగదీసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నాకు పిలుపు ఇవ్వగానే హడిలిపోయిన కేంద్రం ఆమెకు ఈడీతో నోటీసులు ఇప్పించిందని విమర్శించారు.