సుబేదారి, ఫిబ్రవరి 24: కేఎంసీలో పీజీ అనస్థీషియా సెకండ్ ఇయర్ విద్యార్థి సైఫ్ వేధింపుల వల్లే పీజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రీతి ఘటనకు సంబంధించి ఇద్దరి వాట్సాప్ గ్రూప్‌లలో చాటింగ్‌ను పరిశీలించగా.. అందులో ప్రీతిని ఇబ్బంది పెట్టేలా ప్రతి విషయానికి తప్పు పడుతూ వారి బ్యాచ్ వాట్సాప్ గ్రూప్‌లో సైఫ్ మెస్సేజ్ పెట్టాడని తెలిపారు. ప్రసూతి హాస్పిటల్‌కు వెళ్లి హౌస్‌సర్జన్ విద్యార్థులతో కేస్ షీట్లు రాయించిందని, ప్రీతికి బ్రెయిన్ లేదని గ్రూప్‌లో మెస్సేజ్ పెట్టి అందరి ముందు కామెంట్ చేయడం వల్ల ప్రీతి ఇబ్బందిపడినట్టు గుర్తించామని వెల్లడించారు. సైఫ్‌ను ఎదురిస్తూ ప్రీతి పర్సనల్‌గా వాట్సాప్‌లో మెస్సేజ్ పెట్టడంతో అతడికి మింగుడు పడలేదన్న విషయం తేలిందని చెప్పారు. సైఫ్ వేధింపుల విషయాన్ని ప్రీతి తన తండ్రి రైల్వే ఏఎస్సై నరేందర్‌కు చెప్పడంతో.. ఆయన ఫోన్లో వరంగల్ ఏసీపీకి చెప్పే ప్రయత్నం చేశారని, ఆ సమయంలో ఏసీపీ.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బందోబస్త్ మీటింగ్‌లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదని, తర్వాత మాట్లాడి విషయం తెలుసుకొని మట్టెవాడ ఎస్సై శంకర్‌నాయక్‌ను సోమవారం కేఎంసీకి పంపారని వివరించారు.
ఎస్సై శంకర్‌నాయక్ కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్, హెచ్‌వోడీ నాగార్జునరెడ్డి సమక్షంలో ప్రీతి, సైఫ్‌తో మాట్లాడి ఇద్దరినీ మందలించారని చెప్పారు. సైఫ్ మానసికంగా వేధించడం వల్లే బుధవారం ప్రీతి అనస్థీషియా ఎమర్జెన్సీ కిట్‌లో సక్సీ శాంపిల్స్ అనే ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిందని తెలిపారు. ప్రీతిని సైఫ్ మానసికంగా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించాడని ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. అతడిపై ఆత్మహత్యాయత్నం ప్రేరేపణ, సెక్షన్ 306, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ర్యాగింగ్ నిరోధక చట్టం సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేశామని, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీపీ వెల్లడించారు. పూర్తిస్థాయి విచారణ కొనసాగుతున్నదని, ప్రీతి బ్లడ్, డ్రగ్ శాంపిల్స్ రిపోర్ట్ రావాల్సి ఉందని చెప్పారు. ప్రీతి తెలివైన విద్యార్థిని అని, ప్రశ్నించే తత్వం, సున్నిత మనస్తత్వం కలదని, ఇటీవలే యూపీఎస్సీ ఇంటర్వ్యూకు కూడా హాజరైందని, ఆమె త్వరగా కోలుకోవాలని సీపీ ఆకాంక్షించారు. కేఎంసీ, ఎంజీఎంలో తాను స్వయంగా విచారణ చేశానని, కేఎంసీలో సీనియర్ల బాసిజం బాగా ఉన్న విషయాన్ని గుర్తించినట్టు సీపీ వెల్లడించారు.
హనుమకొండ: వేధింపుల వల్లే ప్రీతి చనిపోయిందని తాను మీడియాతో మాట్లాడినట్టుగా టీవీలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్త నిజం కాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. చనిపోయే స్థితి నుంచి ప్రీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ అంశాన్ని వక్రీకరించడం సరికాదన్నా రు. దయచేసి తన మనోభావాన్ని అర్థం చేసుకోవాలని, ఇలాంటి సున్నితమైన విషయాలను వివాదం చేయొద్దని మంత్రి ఎర్రబెల్లి కోరారు.