రాయపర్తి, జూన్ 15: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించకపోయినా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పాలనను కొనసాగిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. బుధవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లిలో కలెక్టర్ బీ గోపితో కలిసి మంత్రి పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా 4 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని పరిశీలించారు.
సీసీ రోడ్లు, మురుగు కాల్వలను ప్రారంభించారు. జడ్పీ పాఠశాల, మండ ల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో 84 లక్షల తో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక అంగడి మైదానంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి చెత్తను ఎత్తారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై సవతి ప్రేమను ఒలకబోస్తున్నదన్నా రు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణను చూసి తట్టుకోలేక మోదీ సర్కారు సీఎం కేసీఆర్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో ఉనికిని కోల్పోతున్న ప్రతిపక్ష పార్టీలన్నీ అబద్ధపు ప్రచారాలతో కాలం వెళ్లదీస్తున్నాయని మండిపడ్డారు.
లింగాలఘనపురం, జూన్ 15: మంత్రి ఎర్రబెల్లి కార్యక్రమం ముగించుకొని వెళ్తుండగా జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని చీటూరు గ్రామం వద్ద రోడ్డు కిరువైపులా మొక్కలు నాటుతున్న మహిళా కూలీలు కన్పించారు. వెంటనే తన వాహనం దిగి వారి వద్ద కెళ్లి ఆప్యాయంగా పలుకరించారు. గడ్డపార తీసుకొని గోతులను తవ్వుతూ కూలీలతో ముచ్చటించారు. రోజూ కూలీ ఎంత గిట్టు బాటు అవుతుందని ఆరా తీశారు.