నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, సెప్టెంబర్ 1: ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఆసరా పింఛన్లు ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఒక్క తెలంగాణలో మాత్రమే సీఎం కేసీఆర్ హయాంలో పింఛన్ లబ్ధిదారులకు ప్రతినెలా రూ.2,016 చొప్పున అందజేస్తున్నట్టు చెప్పారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, మునిపల్లిలో నిర్వహించిన కార్యక్రమాల్లో 5,321 మంది కొత్త పింఛన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ర్టాల్లో ఎక్కడా రూ.2,016 పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. సంగారెడ్డికి సమీపంలో ఉన్న బీదర్‌లోనూ రూ.600 మాత్రమే ఇస్తున్నారని, దీన్ని ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 45 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తుండగా, సంగారెడ్డి జిల్లాలో 1.05 లక్షల మందికి అందజేస్తున్నామని, కొత్తగా మరో 66 వేల మందికి మంజూరు చేసినట్టు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం పెన్‌పహాడ్, చివ్వెంల మండలాల ఆసరా కొత్త లబ్ధిదారులకు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పింఛన్ కార్డులు పంపిణీ చేశారు.
జనగామ జిల్లా పాలకుర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామంలో కొత్తగా మంజూరైన వారికి పింఛన్ మంజూరు పత్రాలు, డిజిటల్ కార్డులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అందజేశారు. గంట్లకుంట గ్రామంలో లబ్ధిదారుల ఇండ్లకు నేరుగా వెళ్లి కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆసరా పెన్షన్లతో వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పింఛన్లు రూ.200 వచ్చేదని, ఇప్పుడు రూ.2 వేలు ఇస్తున్నట్టు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇంత ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను విమర్శించే ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. పాలకుర్తిలోని మంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలో మంత్రి ఎర్రబెల్లి, కలెక్టర్ శివలింగయ్య పింఛన్‌దారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో గురువారం ఆసరా కొత్త పింఛన్లను రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి కండ్లల్లో ఆనందం చూడటమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో రూ.12 వేల కోట్లు పింఛన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, నగర మేయర్ దండు నీతూకిరణ్ తదితరులు పాల్గొన్నారు.