వరంగల్ : సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో రూ.100కోట్లతో పాలకుర్తిని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. పాలకుర్తి, వల్మిడి, బమ్మెరను ప్రగతిపథంలో నడిపిస్తున్నామన్నారు. గత పాలకులు ఆలయాలను పట్టించుకోలేదని, కేవలం దాతల సాయంతోనే నడిచేవన్నారు. సీఎం కేసీఆర్ అయ్యాక తెలంగాణ దేవాలయాలకు పూర్వవైభవం వచ్చిందని, పాలకుర్తి ఆలయానికి సీఎం కేసీఆర్ సైతం నిధులు మంజూరు చేశారన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం గుట్టపై కార్తీక మాసం సందర్భంగా అఖండ దీపాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెలిగించారు. కార్యక్రమానికి ఉత్తర కాశీపీఠాధిపతి స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే మూడో అఖండ జ్యోతిగా పాలకుర్తి అఖండ దీపోత్సవం పేరుగాంచిందన్నారు. అరుదైన హరిహర క్షేత్రం, అత్యంత మహిమాన్వితైన దేవాలయమని.. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ఎంతో పవిత్రమన్నారు. అఖండ దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని, ప్రజలంతా సుఖ సంతోషాలతో.. సకల సౌభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఉత్తర కాశీపీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళా భక్తులు వేలాది కార్తీక దీపాలను వెలిగించారు. జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, పుర ప్రముఖులు, ఈవో రజనీ కుమారి, అర్చకులు, ఆలయ సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు.