హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోనూ పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. పరిశ్రమలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం ద్వారా వృద్ధి సాధించేందుకు సరికొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధిని పెద్ద కంపెనీలకే పరిమితం చేయకుండా చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో ఆదివారం అమెరికాలోని అట్లాంటాలో జరిగిన బిజినెస్ సెమినార్లో ఆయన మాట్లాడారు. ఐటీతోపాటు ఇతర పరిశ్రమల సుస్థిరాభివృద్ధి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా పారిశ్రామికరంగాన్ని బలోపేతం చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
సెమీకండక్టర్, మెడికల్ డివైజ్ పరిశ్రమల అభివృద్ధికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటునకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సెమీ కండక్టర్ల పరిశ్రమలను రాష్ర్టానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏఐ నగరం ఏర్పాటునకు ప్రభుత్వం 200ఎకరాలు కేటాయించినట్టు చెప్పారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించే ఏఐ సదస్సులో పాల్గొనాలని అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులను మంత్రి ఆహ్వానించారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటునకు ఎన్నారైలు, పెట్టుబడిదారులు ముందుకు రావాలని విజ్ఞప్తిచేశారు. వారికి కావాల్సిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్య రంగాల్లో అన్ని వర్గాల ప్రజల సమ్మిళిత అభివృద్ధి కోసం మెరుగైన ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నట్టు మంత్రి చెప్పారు.