హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరామని ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. కేసీఆర్‌కు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని తమకు అందించి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సహకరించాలని కోరామని చెప్పారు.
మంగళవారం ఆయన యశోద దవాఖానలో కోలుకుంటున్న కేసీఆర్‌ను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పరామర్శించారు. అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యవంతులై అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని ఈ సందర్భంగా కేసీఆర్‌కు హామీ ఇచ్చామని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడుతున్నదని, బహుశా రెండు మూడు రోజుల్లో దవాఖాన నుంచి డిశ్చార్జ్ అవుతారని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
రాష్ట్ర శాసనసభ నూతన స్పీకర్ ఎన్నిక కోసం బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సహా పలువురు నేతలు హాజరుకానున్నారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కోరిన నేపథ్యంలో నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.