హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : ఎవరెన్ని ధర్నాలు చేసినా, ఆపే ప్ర యత్నం చేసినా లగచర్లపై ముందుకే పోతామ ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టంచేశారు. కొంచెం ఆలస్యమైనా పరిశ్రమలు పెడుతామని పేర్కొన్నారు. లగచర్ల, ఇతర ప్రాంతాల్లో పరిశ్రమలను ఆపేందుకు కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. లగచర్లలో పరిశ్రమల ఏర్పాటును అడ్డుకున్నారని, అయినా ఆరేడు నెలలు ఆలస్యమవుతుంది తప్ప ఏమీ కాదని, చివరికి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి తీరుతామని, అదే కార్యాచరణ, లక్ష్యంతో ముందు కు సాగుతున్నామని తెలిపారు. మంగళవారం హిల్ట్ పాలసీపై శాసనసభ, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. హిల్ట్ (ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్) పాలసీ కేవలం భూ వినియోగ మార్పిడికి సం బంధించినదే కాదని, భవిష్యత్తు తరాలకు స్వ చ్ఛమైన గాలి, నీరు, ఆరోగ్యాన్ని అందించే ఉద్దేశంతో తెచ్చామని తెలిపారు. ఇది పూర్తిగా స్వచ్ఛందమని, ఇందులో ఎవరినీ బలవంతం చేయడం లేదని చెప్పారు.
‘కాలుష్య కారక పరిశ్రమలను తరలించిన తర్వాత అకడ ఏదో చేస్తారని కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నరు. ఎవరెన్ని వి మర్శలు చేసినా మేం వెనకి తగ్గం. ప్రజలకు మంచి చేయడం ఆపం. కొన్ని పరిశ్రమలు కాలం చెల్లిన టెక్నాలజీనే వినియోగిస్తున్నయి. ఫలితంగా పరిసరాల్లో కాలుష్యం పెరుగుతున్నది, అందుకే హిల్ట్ పాలసీ రూపొందించినం. తమ భూములను కన్వర్షన్ చేసుకోవాలనుకునే పరిశ్రమల యజమానులు టీజీఐపాస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
పారిశ్రామికీకరణ కంటే ప్రజల ప్రాణానికే (రైట్ టు లైఫ్- ఆర్టికల్-21) ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం వర్సెస్ ఎంసీ మెహ తా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని, కోర్టు ఢిల్లీలో నివాస ప్రాంతాల మధ్య ఉన్న 168 ప్రమాదకర పరిశ్రమలను తరలించాలని తీర్పు వెలువరించిందని మంత్రి గుర్తుచేస్తూ ఇదే హిల్ట్ పాలసీకి ప్రాతిపదిక అని చెప్పారు. నిపుణులతో చర్చించిన తర్వాతే హిల్ట్ పాలసీని రూపొందించామని వివరించారు.
‘నగరంలోని చాలా ఇండస్ట్రియల్ ఏరియాల్లోని భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన లెడ్, మెర్క్యురీ, ఆర్సెనిక్ వంటి హెవీ మెటల్స్ స్థాయిలు ఉండాల్సిన దాని కంటే 1000 శాతం ఎకువ ఉన్నయి. పారిశ్రామిక రసాయన వ్యర్థాలే ఈ దుస్థితికి కారణం. దీనివల్ల రాబోయే తరాల్లో జెనెటిక్ మ్యుటేషన్స్ వచ్చే ప్రమాదముందని ఇప్పటికే పలు సైంటిఫిక్ స్టడీస్ తేల్చినయి. ఇప్పటికీ మనం మేలోకపోతే ఈరోజు కాకున్నా ఏదో ఒక రోజు హైదరాబాద్ కూడా ఢిల్లీలా మారడం ఖాయం. ప్రతి ఇల్లూ ఒక హాస్పిటల్ అవుతది. పిల్లలకు బొమ్మలు, బుక్స్ కొనిపించినట్టే నెబ్యులైజర్లు, ఇన్హేలర్లు తప్పనిసరి కొనివ్వాల్సి వస్తది’ అని హెచ్చరించారు.