Minister Dayakar Rao | కష్ట సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని, వారికి నిత్యం అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజాప్రతినిధులకు సూచించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేశ్ నన్నపనేని నరేందర్, చల్ల ధర్మారెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, సీపీ రంగనాథ్, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులకు కర్తవ్య బోధన చేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని, తెలిసో తెలియకో అవసరాల కోసమో లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు కట్టుకున్నారని, అలాంటి వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పారు. భారీగా వర్షాలకు ఆయా ప్రాంతాల ప్రజలు కకావికులం అయ్యారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనపై ఉందన్నారు. మానవత్వంలో అందరూ స్వయంగా సహాయక చర్యలో పాల్గొనాలని, దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలకు అండగా నిలబడాలన్నారు.
కష్ట సమయాల్లో అండగా నిలిస్తేనే తిరిగి ప్రజలకు మనకు అండగా ఉంటారన్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా వరదలపై సమీక్షిస్తున్నారని, తనకు ఫోన్ చేసి తాజా పరిస్థితులపై తెలుసుకుంటున్నారన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారన్నారు. సీఎస్ శాంతికుమారి సైతం ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్షిస్తున్నారని, అధికారులను అప్రమత్తం చేశారన్నారు.
అంతకు ముందు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సంతోస్నగర్లో మంత్రి స్వయంగా ముంపు ప్రాంతాల ప్రజలకు నీరు, ఆహార పొట్లాలు అందించారు. ఓ ట్రాక్టర్లో తరలిస్తున్న ప్రజలను కలిసి ముచ్చటించారు. ఓ పసికందుని ఎత్తుకొని ముద్దు చేశారు. హంటర్ రోడ్డులోని సంతోషిమాత గుడి దగ్గర లోతట్టు ప్రాంతంలో నీటిలో చిక్కుకుపోయిన ఓ వృద్ధురాలిని ఎమ్మెల్యే నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, కమిషనర్ రిజ్వాన్ బాషా, రెస్క్యూ టీం సభ్యులు స్వయంగా సురక్షితంగా ఒడ్డుకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడారు. మంత్రి మోకాల్లోతు నీటితో స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెప్పారు.