జనగామ : జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జనగామ కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముతిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, డీసీపీ సీతారాం, మున్సిపల్ చైర్మన్ పోకల జమున హాజరయ్యారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
అంతకు ముందు పోలీసు నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1948, సెప్టెంబర్ 17వ తేదీన 74 సంవత్సరాల క్రితం మన తెలంగాణ భారత దేశంలో అంతర్భాగమైందని, రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం పాలనలోకి వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నదన్నారు. రాష్ట్రంలో జనగామ జిల్లాను అగ్రగామిగా నిలబెట్టేందుకు పూర్తి సహకారం అందిస్తామన్న ఆయన.. జిల్లా అభివృద్ధిని శాఖలవారీగా ప్రజలకు వివరించారు. జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి భవనాల నిర్మాణం చేపడతాం జిల్లా అభివృద్ధిని అంచెలంచెలుగా చేపడుతూ సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.
ఉద్యాన శాఖ ద్వారా రైతులకు స్థిరాదాయాన్ని అందించే ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మత్స్యశాఖ ద్వారా తొమ్మిది రిజర్వాయర్లు 723 చెరువుల్లో 3కోట్ల చేపల విత్తనాలను విడుదల చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. స్టేషన్ ఘనపూర్‌లో రూ.10 లక్షల చేపలు మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. దళిత బంధు పథకం కింద జిల్లాలో 18 .50 కోట్లతో 155 యూనిట్లను మంజూరు చేసి దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామన్నారు. మినీ డైరీ పథకాన్ని కూడా అమలు చేస్తూ ఒక యూనిట్‌కి రూ.4లక్షల చొప్పున 562 మంది లబ్ధిదారులకు పాడి గేదలు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీవో మధుమోహన్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.