Minister Dayakar Rao | కేసీఆర్ ముఖ్యంత్రి అయ్యాకే తండాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజకర్గంలోని పలు తండాల్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దుబ్బ తండా, లకావత్ తూర్పుతండా, దేవుని గుట్ట తండా, పొట్టిగుట్ట తండా, లక్ష్మణ్ తండా, సిత్య తండా, పడమటి తండా, లకావత్ తండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో దయాకర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు ముందు తండాలు తల్లడిల్లేవని, కనీస వసతులు లేక గిరిజనులు ఇబ్బందులుపడ్డారన్నారు.
తెలంగాణ తర్వాత కేసీఆర్ అయ్యాక తండాలకు మహర్దశ వచ్చిందన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. గ్రామాలకు ధీటుగా ప్రభుత్వం చేసిందని, ఒక్కో తండాను రూ.కోటితో అభివృద్ధి చేశామన్నారు. అలాగే కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారిందని, అందుకే ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడారన్నారు. కాంగ్రెస్ ఇంకా వచ్చేది లేదని.. ఇచ్చేది లేదన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్లు ఘనత కేసీఆర్‌దేనన్నారు.
ఎస్టీల్లో వర్గీకరణ చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. తండాలకు వచ్చే ఆ పార్టీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు ముందు తండాలు ఎలా ఉండేవని.. ఇప్పుడు ఎలా ఉన్నాయో విశ్లేషించుకోవాలన్నారు. ప్రజలను విభజించి పాలించే కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్ నేతలను నియోజకవర్గంలోకి కాలు పెట్టనివ్వొద్దని, తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మన కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు, తనకు అండగా నిలువాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కష్టాల్లో సుఖాల్లో మీతో నేను ఉన్నానని, ఇప్పుడు ముఖం తెలియని వాళ్లు వస్తున్నారని.. ఎన్నికలు కాగానే వెళ్లిపోతారన్నారు. తండాలను, గిరిజనుల సంక్షేమానికి తోడ్పాటునందిస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాల్సిన అవసరం ఉందన్నారు.