హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రతి నెలా వేతనాలు చెల్లించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సోమవారం ఆయన సచివాలయంలో టీవీవీపీ, డీపీహెచ్ పరిధిలోని దవాఖానల్లో మౌలిక సదుపాయాలు, వైద్యసేవలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దవాఖానల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదనపు సేవలైన సెక్యూరిటీ, శానిటేషన్, డైట్, లాండ్రీ సేవలు అందించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంకీ పాక్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదన్నారు. గాంధీ, ఫీవర్ దవాఖానల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేయాలని సూచించారు.
ప్రభుత్వ దవాఖానలు, మెడికల్ కాలేజీల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, సిబ్బందికి భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జూడా ప్రతినిధులు డాక్టర్ కొమ్ము రాహుల్, జే ఐజాక్న్యూటన్, శ్రీనాథ్, సందీప్అరోలా, సందీప్‌చారి పాల్గొన్నారు.