హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 13,929 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇందులో 7,170 పోస్టులకు నియామకాలు కొనసాగుతున్నాయని, రిక్రూట్మెంట్ తర్వాత 6,759 ఖాళీలు ఉంటాయని స్పష్టంచేశారు. సోమవారం రాష్ట్ర శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సిబ్బంది కొరత ఉన్నట్టు సర్వేలు సూచిస్తున్నాయి..? కదా అని ప్రశ్నించగా మంత్రి స్పందించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్(145), డీహెచ్(335), టీవీవీపీ(2379), డీఎంఈ (2786) పరిధిలో మొత్తం 5645 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 65 లీజు మెడికల్ షాపులు
రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు లీజు ప్రాతిపదికన 65 మెడికల్ షాపులు నడుపుతున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ గాంధీ(5), ఉస్మానియా(4), ఇతర ప్రభుత్వ దవాఖానలు (42), జిల్లా, ఏరియా దవాఖానలు (11), నిమ్స్ (3) కలిపి మొత్తం 65 లీజు మెడికల్ షాపులు ఉన్నట్టు వివరించారు. లీజు పరిమితి ముగిసినా.. నిబంధనలకు విరుద్ధంగా సదరు దుకాణాలు కొనసాగుతున్నాయా..? అని ఎమ్మెల్సీ ప్రశ్నించగా.. ఆరు మెడికల్ షాపులకు సంబంధించి కోర్టు కేసులు పరిష్కారమయ్యాయని, తొలగించే ప్రక్రియ నడుస్తున్నదని చెప్పారు. తాజా టెండర్లకు సంబంధించి జనరల్ మెడికల్ స్టోర్స్ కోసం ఒక కొత్త పాలసీని తీసుకొస్తామని చెప్పారు.