Minister Damodara | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): జీవో-33లో మార్పులు చేయాలని కోరేందుకు వెళ్లిన తమపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తంచేశారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. శుక్రవారం పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్‌లో కలిశారు. తమ పిల్లలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతిపక్ష నేతలను కలుస్తారా? అని తమపై కసురుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఓ ఆడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘మీరు హరీశ్‌రావును కలిశారు కదా, విమర్శిస్తున్నారు కదా.. జీవో ప్రకారం నడుచుకోండి, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి’ అని సీరియస్‌గా మాట్లాడారని పేర్కొన్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి దేశంలో లేరని, రాగానే ఆయనతో మాట్లాడుతానని చెప్పి పంపించారని తెలిపారు.
జీవో 33ను రద్దు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ శుక్రవారం డిమాండ్ చేశారు. స్థానికత నిర్ధారణ ప్రక్రియలో చేసిన మార్పు కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, స్వరాష్ట్రంలోని విద్యార్థులే స్థానికేతరులుగా మారే దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాలకు చెందిన విద్యార్థులు వారికి ఉన్న వెసులుబాటు, ఇతర కారణాలవల్ల పక రాష్ట్రంలో ఇంటర్ పూర్తి చేసి, తిరిగి మన ప్రాంతానికి వచ్చి వైద్య విద్యను అభ్యసించాలనుకుంటారని చెప్పారు. జీవో 33తో వారంతా స్థానికతను కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థులకు న్యాయం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్‌ను నిరాకరిస్తూ గత నెల 1న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 12న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరుపనున్నది.