World Bank | హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రపంచబ్యాంకు అడుగులు పడుతున్నాయి. మొదట వైద్యారోగ్య రంగంలోకి ఆ సంస్థ ప్రవేశించనున్నది. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం సచివాలయంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి నిధులు సమకూర్చాలంటూ వైద్యారోగ్యశాఖ నుంచి ప్రతిపాదనలు అందజేశారు. రాష్ట్రంలోని సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించడానికి, అత్యాధునిక వసరమైన నిధులను మంజూరు చేస్తామని ప్రపంచబ్యాంకు ప్రతినిధులు హామీ ఇచ్చారు. దీంతోపాటు టీవీవీపీ పరిధిలోని దవాఖానల్లో పరికరాల కొనుగోలుకు సైతం నిధులు ఇస్తామని చెప్పారు. ఆరోగ్య మహిళా క్లినిక్స్‌ను పెంచడానికి కూడా నిధులు ఇస్తామని తెలిపారు. ట్రామా సెంటర్లు, క్యాన్సర్ స్రీనింగ్, కిడ్నీ ఇన్ఫెక్షన్లను గుర్తించే ఆధునిక యంత్రాలను అందించడానికి అవసరమైన ప్రతిపాదనలను అందించాలని మంత్రికి సూచించారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాక్షి, డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, ప్రపంచబ్యాంకు ప్రతినిధులు జుంకో ఓనిషి, అపర్ణ సోమనాథ్, బత్తుల అమిత్ నాగరాజ్, అజయ్టాండన్, లక్ష్మీ శ్రీపాద్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): పీహెచ్‌సీల్లో కాలం చెల్లిన మందులను నిల్వ ఉంచుతున్నారని డీపీహెచ్ రవీందర్ నాయక్ పేర్కొన్నారు. ఆ మందులను పడేయకుండా, నిల్వ ఉంచినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే వాటిని గుర్తించి పడేయాలని తాజాగా అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు జారీచేశారు. నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేయాలని మెడికల్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులను ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు జరుపుతామని, కాలం చెల్లిన మందులు దొరికితే దవాఖాన సిబ్బందితోపాటు డీఎంహెచ్‌వోలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు (జూడా) సమ్మె విరమించారు. కోల్‌కతాలోని ఆర్జీకర్ దవాఖాన ఘటన నేపథ్యంలో ఈ నెల 14 నుంచి వారు సమ్మెలో కొనసాగుతున్నారు. తాము లేవనెత్తిన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, ఈ నేపథ్యంలోనే సమ్మె విరమిస్తున్నట్టు జూడాల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇకనుంచి సేవలు కొనసాగిస్తామని, ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోతే మళ్లీ సమ్మెకు సిద్ధమని చెప్పారు.