హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : నిలోఫర్ దవాఖానలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిలోఫర్‌లో అన్ని విభాగాలను పటిష్ఠపర్చాలని ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. రోగుల సహాయకుల కు దవాఖానలో మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించాలని సూచించారు.
దవాఖానలోని భవనాల పరిస్థితిపై టీజీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. ప్రస్తుత వర్షాకాలంలో నిలోఫర్‌లో శానిటేషన్, డ్రైనేజీ సిస్టమ్‌పై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణిందర్‌రెడ్డి, డీఎంఈ నరేంద్రకుమార్, గాంధీ సూపరింటెండెంట్ వాణి పాల్గొన్నారు.