హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఎస్సీ కులాల్లో అసమానతల వల్లే ఆందోళనలు మొదలయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. బేగంపేట టూరిజం ప్లాజాలో మంగళవారం ‘మాదిగ అమరవీరుల సంస్మరణ సభ’కు ఆయన హాజరై మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారని గుర్తుచేశారు. హక్కుల కోసం జరిగే పోరాటాలకు రాజకీయరంగు పులమడం సరికాదని సూచించారు. వెనకబడిన వర్గాలకు న్యాయం చేసేలా వన్‌మ్యాన్ కమిషన్ నివేదిక ఇచ్చిందని స్పష్టం చేశారు.
త్వరలో వర్గీకరణకు చట్టం చేస్తామని, ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ చేపడతామని హామీ ఇచ్చారు. అంతకుముందు మంత్రి వర్గీకరణ పోరాటంలో అమరులైన ఐదుగురి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.ఐదు లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, కాలే యాదయ్య, తోట లక్ష్మీ కాంతారావు, మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మాజీ ఎంపీ పసునూరు దయాకర్, డాక్టర్ ఏ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.