హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): కొవిడ్‌పై నిరంతరం నిఘా కొనసాగించాలని.. ప్రజలకు అవగాహన కల్పించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు సూచించారు. సోమవారం కొవిడ్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వ్యాధుల నివారణకు ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతీజిల్లాలోనూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. డెంగీ, మలేరియా కేసులు ఎకువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ డిపార్ట్మెంట్లను అలర్ట్ చేయాలని, ఆరోగ్యశాఖ నుంచి స్పెషల్ టీమ్‌లను పంపించి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రం లో వర్షాలు మొదలయ్యాయని, సీజనల్ వ్యాధులతో హాస్పిటళ్లలో ఓపీ, ఐపీ పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు.