PHC | పీహెచ్‌సీలను బలోపేతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్లో వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా ఉండి వారి ఆరోగ్యానికి, ముఖ్యంగా గర్భిణులకు అవసరమైన పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ వారికి సరైన మందులు అందించాలన్నారు. మాతాశిశు మరణాలను తగ్గించేందుకు చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అర్హులైన నర్సులకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. చైల్డ్ హెల్త్‌లో భాగంగా టీకాలు అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా అవసరమైన శాంపిల్స్ సేకరించి.. టెస్టులు వేగవంతం చేయాలన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా అమలవుతున్న పల్లె, బస్తీ దవాఖాన, పీహెచ్‌సీల పనితీరును మెరుగుపరచుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు.
ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల నివారణకు అవసరమైన మందులు, పరీక్షలను అందుబాటులో ఉంచాలన్నారు. టీబీ, కుష్టు నివారణకు చర్యలు చేపట్టాలని, గ్రామసభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో మెడికల్ హెల్త్ కమిషనర్ ఆర్వీ కర్ణన్, అదనపు డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్, జేడీలు పద్మజ, శ్రీనివాస్, స్వరాజ్యలక్ష్మి, రాజేశం, జాన్ బాబు, ప్రోగ్రాం అధికారులు ప్రసాద్, నందిత, శ్రీదేవి, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.