నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాలో ముగ్గురు సాక్షులు బుధవారం ప్రజాప్రతినిధుల కోర్టులో తమ వాంగ్మూలం ఇచ్చారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేసింది. ఈ కేసులో ఉన్న నలుగురు సాక్షుల వాంగ్మూలం రికార్డు కావడంతో ఈ నెల 20న విచారణ కొనసాగుతుందని కోర్టు సూచించింది. అనంతరం సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా మంత్రి కొండాసురేఖ కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు సబబు కావని, ఆయన పరువుకు భంగం కలిగించే విధంగా ఆమె వ్యాఖ్యలు టీవీల్లో ప్రసారమయ్యాయని కోర్టుకిచ్చిన వాంగ్మూలంలో తెలిపినట్టు వివరించారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. అక్టోబర్ 2న మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు టీవీల్లో ప్రసారమయ్యాయని, అది చూసి మనస్సు చలించిపోయిందని చెప్పారు. వెంటనే కేటీఆర్‌కు ఫోన్ చేసి టీవీల్లో ప్రసామవుతున్న వార్తల గురించి తెలిపానన్నారు.
మంత్రి సురేఖపై సినీ నటుడు నాగార్జున వేసిన పరువునష్టం కేసులో ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు కౌంటర్ సమర్పించారు. కొండా మాట్లాడిన అంశాల వల్ల అక్కినేని కుటుంబానికి, నాగార్జునకు పరువు నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. కౌంటర్‌కు సంబంధించిన విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు మేజిస్ట్రేట్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా హైదరాబాద్ సివిల్ కోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువునష్టం కేసులో సైతం కొండా సురేఖ తరఫున వకాలత్ దాఖలు చేసినట్టు న్యాయవాది తెలిపారు.