మేడ్చల్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేసే వరకు వదిలిపెట్టబోమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం మెండివైఖరికి నిరసనగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. పంజాబ్లాగే తెలంగాణ రైతులు పండించిన పంటలను పూర్తిగా కొనుగోలు చేసే వరకు ఉద్యమిస్తామని పునరుద్ఘాటించారు. ఈ నెల 24 నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు బుధవారం మేడ్చల్ జిల్లా అలియాబాద్లో జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జడ్పీచైర్మన్, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొంటారని తెలిపారు.