Health Department | హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఆరంభ శూరత్వంగానే కనిపిస్తున్నది. వివిధ శాఖల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై తొలుత హడావుడి చేస్తున్నా, ఆ తర్వాత కిమ్మనని పరిస్థితి దాపురించింది. దీనికి ఇటీవల వైద్యశాఖలో జరిగిన బదిలీలపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వ స్పందన నిదర్శనంగా నిలుస్తున్నది. వైద్యారోగ్యశాఖ పరిధిలో డీపీహెచ్ మినహా ఇతర ఏ విభాగంలోనూ ఆరోపణలు రాకపోవడం గమనార్హం. బదిలీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేయిస్తామంటూ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా హడావుడిగా ప్రకటన చేశారు. అయినా ఇప్పటివరకు నష్టనివారణ చర్యలు తీసుకోవడమే లేదు.
కనీసం డీపీహెచ్ గానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గత ప్రభుత్వం 2018లోనూ ఇదే తరహాలో బదిలీలు చేపట్టినా ఎలాంటి ఆరోపణలు రాలేదని ఉద్యోగులే గుర్తు చేస్తున్నారు. డీపీహెచ్ విభాగంలో నర్సింగ్ ఆఫీసర్లు మొదలు డిప్యూటీ డైరెక్టర్ వరకు దాదాపు అన్ని హోదాల్లోనూ బదిలీలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా నర్సింగ్ ఆఫీసర్ల బదిలీలు ఏకంగా కౌన్సెలింగ్‌ను బహిష్కరించి, కోఠిలో రాస్తారోకో చేసే స్థాయికి దారితీసింది. సీనియార్టీ జాబితా, వేకెన్సీ జాబితాలో తప్పులు దొర్లాయని నర్సులు ఆరోపించారు. దీంతో మొదట మార్పులు చేసి, రెండోసారి జాబితా విడుదల చేశారు. అయినా తప్పులు దొర్లడంతో మరోసారి రివైజ్ చేశారు. ముచ్చటగా మూడోసారి కూడా ఆరోపణలు రావడంతో ఏకంగా కౌన్సెలింగ్‌నే ఆపేశారు.
చనిపోయిన వ్యక్తినీ బదిలీ చేశారు!
ల్యాబ్ అసిస్టెంట్ల బదిలీలపైనా పలు ఆరోపణలు వచ్చాయి. ఫోకల్ టు నాన్ ఫోకల్ పాటించలేదని, సీనియార్టీ జాబితా తప్పుల తడకగా ఉన్నదని ఆరోపణలొచ్చాయి. టీవీవీపీ ఉద్యోగులను డీపీహెచ్ ఉద్యోగులుగా మార్చి బదిలీ చేశారని, చనిపోయిన వ్యక్తిని కూడా బదిలీ చేశారన్న ఆరోపణలు ఇలా ఎన్నో వెల్లువెత్తాయి. డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ బదిలీలను కండ్లు మూసుకొని చేశారనే స్థాయిలో ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌లో పనిచేస్తున్న అధికారులకు పక్క ఆఫీస్‌లో పోస్టింగ్‌లు ఇవ్వడం దుమారం రేపింది. అర్హత లేని సంఘాల నేతల సిఫారసు లేఖలపైనా దుమారం చెలరేగింది.
సీఎంవో ఆరా తీసినా విచారణేదీ?
వైద్యశాఖలో బదిలీల్లో జరిగిన రచ్చపై సీఎంవో ఆరా తీసినట్టు ఆనాడే వార్తలొచ్చాయి. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో నర్సింగ్ కౌన్సెలింగ్‌ను నిలిపివేసి, రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపడానికి గత కారణలను తేల్చాలని ఆదేశించినట్టు తెలిసింది. ఈ మేరకు నివేదిక అందిందని అప్పట్లో సచివాలయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత వైద్యశాఖ బదిలీల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా గత నెల 27న ప్రకటించారు. బదిలీల్లో అవకతవకలకు పాల్పడినట్టు తేలితే.. వారు ఏ స్థాయి వారైనా కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. తప్పిదాలకు పాల్పడినట్టు తేలితే చర్యలు తీసకుంటామని డీపీహెచ్ రవీందర్‌నాయక్ కూడా స్పష్టం చేశారు. కానీ రెండు వారాలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి విచారణ జరగలేదు. ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉండటం వల్లే అటు ప్రభుత్వం గానీ, ఇటు ఆ శాఖ ఉన్నతాధికారులు గానీ గప్‌చుప్‌గా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి.
వ్యవసాయశాఖ బదిలీల్లో తీవ్ర జాప్యం
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ శాఖ బదిలీల ప్రక్రియలో తీవ్ర జాప్యం కొనసాగుతున్నది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. తాజాగా చేపట్టిన ప్రక్రియ కూడా నెమ్మదిగా సాగుతుండటంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి జూలై 20 నాటికి బదిలీలకు ప్రభుత్వం గడువు విధించింది. ఈ గడువును పెంచిన ప్రభుత్వం జులై 31 వరకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 15లోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు.. ఇప్పటివరకు ఏఈవో, ఏవో బదిలీలను మాత్రమే పూర్తిచేశారు. ఆ తర్వాత నాలుగు రోజులుగా పైస్థాయి బదిలీలను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడైనా బదిలీలు పూర్తవుతాయనే సందేహాలను ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.వ్యవసాయ శాఖ బదిలీల ప్రక్రియలోనూ తీవ్ర గందరగోళం నెలకొన్నది. తప్పుల తడకగా సీనియార్టీ జాబితా రూపొందించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బదిలీ అయిన ఏఈవోలకు, ఏవోలకు బదిలీ అర్డర్లు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారికి ఎదురుచూపులు తప్పడంలేదు.సందేహాలు న్న ఉద్యోగులు వ్యవసాయశాఖ డైరెక్టరేట్ వస్తున్నా,డైరెక్టర్‌ను కలవడం గగనంగా మా రిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.