హైదరాబాద్: రాష్ట్రంలో గురుకులాల పనితీరు, పరిశుభ్రతపై పార్టీ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటనతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. ప్రభుత్వ యంత్రంగం ప్రభుత్వ హాస్టళ్ల (Govt Hostels ) బాటపట్టింది. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల హాస్టల్‌కు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లనున్నారు. ఇక మంగళవారం తెల్లవారుజాము నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వసతి గృహాల పనితీరు, సౌకర్యాలపై ఆరాతీస్తున్నారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
సోమవారం జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో పాముకాటుతో చనిపోయిన ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన అనిరుధ్ కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించిన విషయం తెలిసిందే. అనిరుధ్లాంటి పరిస్థితి ఏతల్లిదండ్రులకూ రాకూడదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎనిమిదినెలల్లో రాష్ట్రంలోని గురుకులాల్లో 36 మంది విద్యార్థులు చనిపోయారని, వారి కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని, ఈ విషయంలో ప్రభుత్వం రాజకీయ భేషజాలకు పోవద్దని సూచించారు. రాష్ట్రంలోని గురుకులాల పనితీరు, పరిశుభ్రతపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనుభవం ఉన్న నాయకుడు, గతంలో గురుకులాల సెక్రటరీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో కమిటీ వేసి ప్రభుత్వానికి నిష్పక్షపాతంగా సూచనలతో నివేదిక సమర్పిస్తామని చెప్పారు. నాలుగైదు రోజుల్లో కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి 20 సంక్షేమ గురుకులాలను పరిశీలిస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఎనిమిదినెలల్లో గరుకులాల్లో కలుషిత ఆహారం తిని 500 మంది వరకు దవాఖానల్లో చేరినట్టు తెలిపారు. భువననగిరి, సూర్యాపేటలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. వానకాలం కావడంతో గురుకులాలను పరిశుభ్రంగా ఉంచాలని, పాములు, తేళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పెట్టే భోజనంపై కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పర్యవేక్షించాలన్నారు. గురుకులాలను దత్తత తీసుకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తవని ప్రభుత్వానికి సూచన చేశారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల రాజకీయాలు అసలే వద్దని, మనపిల్లలుగా చూసుకుంటూ వారి ప్రాణాలపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.