Dalitha Bandu | హైదరాబాద్, మార్చి 26 ( నమస్తే తెలంగాణ): దళితబంధు లబ్ధిదారులను కాంగ్రెస్ సర్కారు ఆది నుంచీ అనేక ఇక్కట్లపాలు చేస్తున్నది. నిన్నమొన్నటి వరకు నిధులు విడుదల చేయకుండా ముప్పుతిప్పలు పెట్టింది. రోడ్డెక్కి పోరాటాలు చేస్తేకానీ అంగీకరించలేదు. బీఆర్ఎస్ నేతలు, దళితబంధు లబ్ధిదారుల పోరాటంతో ఎట్టకేలకు దిగివచ్చింది. బకాయి నిధులను విడుదల చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ ఇప్పుడు ఆ నిధులపై ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి, కాంగ్రెస్ కీలకనేత కన్నేశారు. వాటా ఎంతో చెబితేనే, తాము చెప్పిన యూనిట్ తీసుకుంటేనే బ్యాంకుల్లోని నిధులను విడుదల చేస్తామని లబ్ధిదారులకు హుకూం జారీ చేశారు. ఇదేమిటని సదరు లబ్ధిదారులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దలను ఏమనలేక అధికారులు కూడా కిమ్మనకుండా ఉండిపోయారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
దళితుల అభ్యున్నతి, ఆర్థిక ప్రగతి లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో దళిత కుటుంబానికి ఎలాంటి షరతులు లేకుండా, వచ్చిన, నచ్చిన ఉపాధి మార్గం ఎంచుకునేందుకు రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని అందజేసింది. పథకానికి సంబంధించి మొదటి, రెండవ విడత కలిపి 44వేల మందికి వర్తింపజేసింది. దాదాపు రూ.4,400 కోట్లను లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసింది. అందులో చాలామంది లబ్ధిదారులు రూ.10లక్షలతో ఒకే యూనిట్‌ను ఏర్పాటు చేసుకోకుండా, ఒకటికి మించి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో తొలుత బ్యాంకులోని కొంత మొత్తం నిధులతో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన నిధులతో మరొక యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో దళితబంధు లబ్ధిదారులకు బ్యాంకుల్లో నిల్వ ఉన్న నిధులను విడుదల చేయకుండా ఆదేశాలను జారీ చేసింది. దీంతో మొదటి విడతలో ఎంపికైన 9,937 మందికి సంబంధించి రూ.324.75కోట్లు, రెండవ విడతలో ఎంపికైన 471మంది లబ్ధిదారులకు సంబంధించి 9.88 కోట్లు బ్యాంకుల్లోనే ఉండిపోయాయి. మొత్తంగా 10,408 మందికి సంబంధించిన రూ.334.63కోట్లు విడుదల కాకుండా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో ఉండిపోయాయి. ఎన్నికల తర్వాత ఆ నిధులను విడుదల చేయాలని లబ్ధిదారులు కోరినా సర్కారు పట్టించుకోలేదు. దాదాపు ఏడాదిపాటు లబ్ధిదారులు పోరాటం చేయడం, బీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు సర్కారు దిగివచ్చింది. లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలోనే ఉండిపోయిన నిధులను విడుదల చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ ఏడాది జనవరిలోనే ఆదేశాలను జారీచేసింది. కానీ దాదాపు 3నెలలు గడచినా ఇప్పటివరకు ఎక్కడా లబ్ధిదారులకు నిధులను విడుదల చేయలేదు.
నిధులు విడుదల చేసేందుకు సర్కారు అంగీకరించిందనే దళితబంధు లబ్ధిదారుల ఆనందం అంతలోనే ఆవిరయ్యింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో 7634 మందికి రూ.281.84 కోట్ల నిధులపై కన్నేసిన ఓ అమాత్యుడు ఇప్పుడు లబ్ధిదారులకు కొత్త నిబంధనలను విధిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. వాస్తవంగా లబ్ధిదారుల అకౌంట్లలోకి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. లబ్ధిదారులు తన ఇష్టం వచ్చిన ఉపాధి యూనిట్‌ను ఎంచుకుని, అందుకు సంబంధించిన అంచనా వ్యయానికి సంబంధించిన కొటేషన్‌ను అధికారులకు అందజేయాలి. సదరు ఎంపీడీవో పరిశీలించి చెక్‌మెమోను జారీ చేసి కలెక్టర్‌కు పంపిస్తారు. కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారుడి బ్యాంకు అకౌంట్లోని నిధులను విడుదల చేయాలని బ్యాంకు మేనేజర్‌కు ప్రొసీడింగ్స్ ఇస్తారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బ్యాంకు మేనేజర్ నిధులను విడుదల చేస్తారు. ఇదీ ప్రక్రియ. కానీ ఇప్పుడు ఆ మార్గదర్శకాలను తుంగలో తొక్కేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము ఇచ్చిన ఎంపిక చేసిన యూనిట్‌ను, అదీ ఎంపిక చేసిన చోటు నుంచే కొటేషన్‌ను తీసుకోవాలని, ఆ యూనిట్‌కు సంబంధించిన మెటీరియల్‌ను అక్కడే తీసుకోవాలని షరతు విధిస్తున్నారని తెలుస్తున్నది. లేదంటే నిధులు విడుదల చేసేది లేదంటూ హుకుం జారీ చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇదే విషయాన్ని పలువురు లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కానీ ఈ తతంగం వెనక ప్రభుత్వ పెద్దలే ఉన్నారని, అధికారులు కూడా చేతులెత్తాశారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రస్తుతం దళితబంధు నిధుల విడుదలకు సంబంధించిన వ్యవహారంలో గోల్మాల్ వెనక ఏకంగా ఓ మంత్రి ఉన్నాడని విశ్వసనీయ సమాచారం. సదరు మంత్రి తనకు సన్నిహితుడైన అధికారినే ప్రత్యేకంగా నియమించుకుని, వ్యవహారాన్ని చక్కబెడుతున్నారని అధికారులే చెప్తున్నారు. తమకు సంబంధించిన అటోమొబైల్ కంపెనీలు, తదితర పరిశ్రమలతో ముందుగా ఒప్పందం చేసుకున్నారని తెలుస్తున్నది. అందులోభాగంగా ప్రస్తుతం నిధుల విడుదలకు ఎదురుచూస్తున్న లబ్ధిదారులను వారివద్దకే పంపిస్తున్నారని, పెద్ద మొత్తంలో కమీషన్లను వసూలు చేస్తున్నారని సమాచారం. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని పేరు చెప్పడానికి లబ్ధిదారులు కోరారు.