హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): నిన్నటిదాకా జూబ్లీహిల్స్ టికెట్ రేసులో అవమానాలకు గురైన మాజీ క్రికెటర్, తాజా మంత్రి అజారుద్దీన్‌కు చేదు అనుభవాలు తప్పడం లేదు. మంత్రిగా ఉన్నప్పటికీ కేవలం మజ్లిస్‌కు నచ్చడంలేదనే నెపంతో ఎన్నికల ప్రచారంలో ఆయనకు ప్రాధాన్యం కల్పించడం లేదని తెలుస్తున్నది. మరీ ముఖ్యంగా మజ్లిస్ నేతలు పాల్గొంటున్న రోడ్‌షోల్లో అజార్‌ను దూరం పెట్టి అవమానిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
గత కొన్నిరోజులుగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటున్న రోడ్‌షోల్లో సైతం అజార్‌కు ప్రాధాన్యం దక్కడం లేదని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఈ మేరకు పలు ఫొటోలను సామాజిక మాధద్యమాల్లో షేర్ చేస్తున్నాయి. మైనార్టీ నేత అయిన అజార్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించి మంత్రి పదవి ఇచ్చిందేగానీ సీఎంతో సహా రాష్ట్ర నేతలు ఆయనకు ఆ గుర్తింపునే ఇవ్వడంలేదని అంటున్నారు. క్రికెట్లో 12వ నంబర్ ఆటగాని మాదిరిగానే ఆయనను చూస్తున్నారని విమర్శిస్తున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన అజారుద్దీన్ ఈ ఉప ఎన్నికలో కూడా టికెట్ ఆశించారు. అజారుద్దీన్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటికీ సీఎం వర్గం ఆయనకు సంబంధం లేకుండానే అధికారిక కార్యక్రమాలు నిర్వహించి, తీవ్ర అవమానానికి గురి చేశారు. దీనిపై తీవ్రస్థాయిలో కలత చెందిన అజార్ నేరుగా ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్‌ను కలిసి వచ్చారు. దీనిపై అధిష్ఠానం మందలింపుతో.. అజార్‌ను టికెట్ రేసు నుంచి తప్పించేందుకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారు. దానికి న్యాయపరమైన చిక్కులు ఏర్పడి.. అది ఎటూ తేలని పరిస్థితి నెలకొంది. మరోవైపు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం అజార్‌కు టికెట్ ఇవ్వొద్దనే షరతు మీదనే కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారనేది రాజకీయంగా బహిరంగ రహస్యమే.
అజార్‌తో పొసగని మరో మంత్రి వివేక్ వెంకటస్వామి జూబ్లీహిల్స్ ఎన్నికల ఇన్చార్జిగా తన వంతు పావులు కదిపారనేది అందరికీ తెలిసిన విషయమే. ఈలోగానే సీఎం వర్గం నవీన్‌యాదవ్‌కు టికెట్ ఖరారు చేయించుకుంది. అజార్‌ను పక్కనబెట్టి ప్రచారాన్ని ముందుకు తీసుకుపోయింది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అత్యంత కీలకమైన ముస్లిం మైనార్టీ ఓటుబ్యాంకుపై ఆది నుంచి ‘ఏదో తేడా కొడుతున్నది’ అన్న స్పష్టమైన సంకేతాలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని చేరుకున్నాయి. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ముస్లిం మైనార్టీలకు అజార్‌ను అవమానాలకు గురి చేయడంఅగ్గికి ఆజ్యం పోసినట్లయింది. దీనిని గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం హడావిడిగా అజార్‌కు మంత్రి పదవిని ఖరారు చేయడంతో ఇష్టం లేకున్నా సీఎం రేవంత్ ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామంతో మజ్లిస్ అధినేత అసద్ తీవ్ర ఆగ్రహానికి గురై జూబ్లీహిల్స్‌ను వదిలి బీహార్ ప్రచారానికి వెళ్లిపోయారు.
అజార్‌కు మంత్రి పదవి ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పట్ల మైనార్టీల్లో నెలకొన్న అసంతృప్తి పోలేదని, అది కచ్చితంగా ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలిస్తుందనేది కాంగ్రెస్‌కు ఉన్న ఫీడ్‌బ్యాక్. దీంతో కనీసం మజ్లిస్నైనా అలక పాన్పు నుంచి కిందకు దింపితే కొంతలో కొంత ఓట్లు రాల్చుకోవచ్చని సీఎం రేవంత్ భావించారని పరిశీలకులు చెప్తున్నారు. అందుకే అజార్‌కు మంత్రిత్వశాఖను కేటాయించడంలో జాప్యం చేసి ఆయన హోం అడిగినప్పటికీ కేవలం మైనార్టీ, ప్రభు త్వ రంగానికే పరిమితం చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో సైతం మంత్రి అజార్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదని మైనార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్‌షో ప్రారంభంలో సీఎం పక్కన ముందువరుసలో కనిపించిన అజార్ ఆ తరువాత సాధారణ నేతగా సీఎం ఉండిపోవడం ఇం దుకు సాక్ష్యమని అంటున్నారు. మజ్లి స్ ఎమ్మెల్యే, ఆ పార్టీ నేతలు పాల్గొంటున్న షేక్పేట్లాంటి ప్రదేశాల్లో జరిగిన రోడ్‌షోలో అజార్‌ను పూర్తిగా దూరం పెట్టారని ఆరోపిస్తున్నారు. మ రో మంత్రి వివేక్ పాల్గొన్న రోడ్‌షోల్లోనూ అజార్‌ను వెనుకవరుసకే పరిమితం చేస్తున్నారని మండిపడుతున్నారు. యూసుఫ్‌గూడ సీఎం రోడ్‌షోలో కాంగ్రెస్ కార్యకర్తలు గజమాల వేసిన సందర్భంలో సీఎంతో పలువు రు మంత్రులు ముందు వరుసలో ఉం టే అజార్ సాధారణ కార్యకర్తలా వెనకనే నిరాశగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది.