హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలు ఖరారు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్-2024ను భట్టి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కంటే తమిళనాడు, కర్ణాటకలో సెక్యూరిటీ గార్డుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో దేశంలోనే ఉత్తమమైన వేతనాలను సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ సెక్యూరిటీ అనేది వేగంగా విస్తరిస్తున్న రంగమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 3.5 లక్షలు వరకు ఉండగా, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు 4 లక్షల మంది ఉన్నట్టు తెలిపారు. సాఫ్ట్వేర్, ఫార్మా రంగాలతోపాటు వివిధ అంశాల్లో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌కు ఈ బడ్జెట్లో రూ. 10 వేల కోట్లు కేటాయించినట్టు గుర్తుచేశారు. రీజనల్ రింగ్ రోడ్డు, ఫోర్త్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతిచోట పోలీసుల కంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఎక్కువగా కనిపిస్తుందని, పారిశ్రామిక, పట్టణీకరణతో వీరి పాత్ర మరింత పెరుగనున్నదని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఏడీజీ(శాంతి భద్రతలు)మహేశ్ భగవత్, ఏసీపీ విక్రమ్‌సింగ్ మాన్, ప్రతినిధులు పాల్గొన్నారు