MIM | మెహిదీపట్నం అక్టోబర్ 7: ఎంఐఎం ఎమ్మెల్యే తన అనుచరులతో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను చితకబాదారు. పోలీసులు వారిస్తున్నా ఎంఐఎం వర్గీయులు కర్రలు, రాళ్లతో కాంగ్రెస్ నాయకులపై దాడిచేసి తరిమికొట్టారు. అరగంటకుపైగా ఇరువర్గాల మధ్య రణరంగం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఓ సందర్భంలో ఎంఐఎం కార్యకర్తలపై ప్రతిదాడికి దిగారు. నాంపల్లి నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ నియోజకవర్గంలోని విజయ్‌నగర్‌కాలనీ డివిజన్ ఫిరోజ్గాంధీనగర్లో సీసీ రోడ్డు పనులను సోమవారం తన అనుచరులతో వెళ్లి పరిశీలించారు. అనంతరం తిరిగి వెళ్తుండగా, అభివృద్ధి పనుల కోసం ఎంఐ ఎం నేతలు ప్రజల నుంచి డబ్బు అడుతున్నారంటూ ఓ మహిళ గట్టిగా అరిచింది. ఇది విన్న స్థానిక ఎంఐఎం ఏరియా అధ్యక్షుడు ఆ మహిళతో గొడవకు దిగడంతోపాటు తన పార్టీ ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ విషయాన్ని పట్టించుకోకుండానే ఫిరోజ్‌ఖాన్ వెళ్లిపోయారు.
ఎంఐఎం ఎమ్మెల్యే రాకతో ఉద్రిక్తత
ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ భారీ బలగాన్ని వెంటేసుకొని ఫిరోజ్గాంధీనగర్కు చేరుకున్నా రు. విషయం తెలుసుకున్న ఫిరోజ్‌ఖాన్ మళ్లీ తన అనుచరులతో చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఇరువర్గాలు రెచ్చిపోయాయి. కాంగ్రెస్ నాయకులపై ఎంఐ ఎం నాయకులు దాడికి దిగారు. గట్టిగా కేకలు వేస్తూ ఏకంగా ఎమ్మెల్యేనే కాంగ్రెస్ నేతలపై దాడిచేశాడు. కాంగ్రెస్ నాయకులపై రాళ్లు విసురుతూ చేతులో కర్ర లు పట్టుకొని, పోలీసుల నుంచి కర్రలు లాక్కొని కాంగ్రెస్ కార్యకర్తలను తరిమికొట్టారు.
ఇరువర్గాలు బూతులు తిట్టుకుంటూ దాడులు చేసుకుంటూ బాహాబాహీకి దిగారు. కొందరికి స్వల్పగాయాలయ్యాయి. తొలుత అదుపు చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను సముదాయించారు. పోలీసుల సాక్షిగా ఎంఐ ఎం ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి కాంగ్రెస్ నేతలను కొట్టిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆసిఫ్‌నగర్ ఏసీపీ విజయ్ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అతికష్టమ్మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఎక్కడి వారిని అక్కడికి పంపించి వేశారు. ఇరువర్గాల నుంచి హుమాయిన్‌నగర్ ఠాణాలో ఫిర్యాదులు అందాయని, ఘర్షణకు కారుకులైన వారందరిపైనా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.