Asaduddin Owaisi | హైదరాబాద్,(నమస్తే తెలంగాణ) : మతాన్ని అడ్డం పెట్టుకొని భారత్‌పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాకిస్థాన్‌కు అసలు ఇస్లాం పదాన్ని ఉచ్ఛరించే అర్హత కూడా లేదని ఏఐఎంఐఎం అధినేత అసద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. అమాయకులను, పిల్లలను చంపాలని ఏ ఇస్లాం బోధిస్తున్నదని పాకిస్థాన్‌ను సూటిగా ప్రశ్నించారు.
టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఉర్దూ జర్నలిస్టుల అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముస్లింలు తమ మాతృభాషగా చెప్పుకొనే ఉర్దూకు పాకిస్థాన్‌లో ఇంతవరకు అధికార భాష హోదా కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం ఏడు శాతం మందే అక్కడ ఉర్దూ మాట్లాడుతుండగా, 40శాతం మంది పంజాబీ, మిగిలినవారు ఇతర భాషలు మాట్లాడుతున్నారని చెప్పారు. భారత్‌లో ఉర్దూకు అధికారభాష హోదా ఉన్నదని గుర్తుచేశారు. పాకిస్థాన్ వాళ్లు భారత ముస్లింలను తక్కువ చేసి చూస్తారని, సాటి ముస్లింను తమతో సమాన పౌరుడిగా భావించని పాకిస్థాన్‌కు ఇస్లాంను ఉచ్ఛరించే అర్హత లేదని స్పష్టంచేశారు.
మతం పేరుతో లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడ్డారని, ఉగ్రవాదులను భారత్‌లోకి పంపి ఇక్కడ అశాంతి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడి జమాతే ఇస్లామీ పాకిస్థాన్ అనే సంస్థకు చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం ఉన్నదని, అసలు ఇస్లాంకు, కమ్యూనిస్టులకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. పహల్గాంలో మహిళల ఎదటే వారి కుటుంబీకులను పొట్టనబెట్టుకోవడం ఏమిటని? ఏ ఇస్లాం ఇలాంటివి బోధిస్తున్నదని నిలదీశారు. పాకిస్థానీలు అధికారిక బిచ్చగాళ్లని, ఒక బిలియన్ డాలర్ అప్పుకోసం ఐఎంఎఫ్‌కు వెళ్లారని దెప్పిపొడిచారు.