MP Asaduddin Owaisi | హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని ఆధారంగా చేసుకుని ముస్లింలు రిజర్వేషన్లు పొందడం లేదు. రిపోర్టుల ఆధారంగానే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ విషయం బీజేపీకి అర్థం కాదు. ముస్లింలను కనుమరుగు చేసేందుకు బీజేపీ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో భారతీయ జనతా పార్టీ పాలనా కొనసాగుతోందన్నారు. మన యువత నిరుద్యోగులుగా ఉన్నారు. చైనాతో సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు పెట్టుకుని, వీటిపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడరు. కానీ ముస్లింలు ఈ సామాజానికి ముప్పు అని మాత్రం అమిత్ షా మాట్లాడుతారని, అది సరికాదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు.
హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఒవైసీ, ఒవైసీ అనే ఏడుపు ఇంకెంత కాలం? అని అమిత్ షాను అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఇకనైనా అలాంటి వ్యాఖ్యలు ఆపి ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మాట్లాడాలని సూచించారు. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం తప్ప తెలంగాణపై బీజేపీకి ఎలాంటి విజన్ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయడంపై మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 50 శాతం సీలింగ్ కోటాను తొలగించేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని డిమాండ చేశారు. వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు స్టే కింద కొనసాగుతున్నాయి. ఒక వేళ ఈ విషయం మీకు తెలియకపోతే సుధీర కమిషన్ నివేదికను పూర్తిగా చదవాలి అని అమిత్ షాకు ఒవైసీ సలహా ఇచ్చారు.