హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): పోటీ పరీక్షలు ఉర్దూ భాష లో నిర్వహించాలని ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. మదరసా బోర్డు పెట్టాలని విజ్ఞప్తిచేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఉర్దూకు ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు ఒవైసీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావనే లేదని గుర్తుచేశారు. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య పొత్తులేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు తాము దగ్గర ఉన్నామంటే కారణం వైఎస్ రాజశేఖర్రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల వల్లే ప్రజలు కాంగ్రెస్కు అధికారమిచ్చారని, దానిని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వం మంచి చేస్తే ప్రశంసిస్తామని, చేయకపోతే విమర్శిస్తామని చెప్పా రు. పాత బస్తీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అనే విషయాన్ని పదేపదే ప్రస్తావించిన కాంగ్రెస్.. మ్యానిఫెస్టోలో దానిని పెట్టలేదని అన్నా రు. ఇమామ్లకు రూ.12 వేలు కాదని, రూ.15 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని కోరారు. రైతుభరోసా, గృహజ్యోతి, ఉచిత కరెంట్ వంటి అంశాలపై స్పష్టమైన విధివిధానాలను ప్రకటించాలన్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాలని అన్నారు. హైదరాబాద్లో దుకాణాలను రాత్రి 11 గంటలలోపే మూసివేయాలని పోలీసులు ఆదేశాలిచ్చారని, వ్యాపారస్తులు, ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకొని రాత్రి 1 గంట వరకు అవకాశం కల్పించాలని కోరారు.