హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ) : ‘ఇది గాంధీభవన్ కాదు.. అసెంబ్లీ. గాంధీభవన్ మాదిరిగా అసెంబ్లీని నడుపుతామంటే కుదరదు. ఒకవేళ మీరు అలాగే నడపాలనుకుంటే మేము సభ నుంచి వెళ్లిపోతున్నాం’ అని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడేందుకు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రయత్నిస్తుండగా స్పీకర్ జీరో అవర్‌ను ప్రారంభించి పసుపు బోర్డు అంశంపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ సభ్యుడికి సమయం ఇచ్చారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ జోక్యం చేసుకుంటూ ప్రశ్నోత్తరాలకు ఇంకా 3-4 నిమిషాల సమయం ఉండగానే ఎలా ముగిస్తారని స్పీకర్‌ను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఎంఐఎం సభ్యులంతా తమ స్థానాలనుంచి ముందుకొచ్చి ఇదేనా సభను నడిపే పద్ధతి అంటూ నిరసన తెలిపారు. ఒవైసీ మాట్లాడుతూ, ‘అసెంబ్లీ ఎజెండా కాపీ తెల్లవారుజామున మూడు గంటలకు పంపుతున్నారు.. మేము ఎప్పుడు చూడాలి? ఎప్పుడు ప్రిపేర్ కావాలి? ప్రభుత్వ వెబ్సైట్లో జీవోలు, సర్క్యులర్ల వివరాలపై తాను పంపిన ప్రశ్నను డిలీట్ చేయడం ఏమిటి?’ అని ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దాటవేయడంలో ఆంతర్యం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘అన్నీ కొత్తకొత్త సాంప్రదాయాలకు తెరతీస్తున్నారు. ఇదేం పద్ధతి, ఇది గాంధీభవన్ అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. సభను నడపడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని అని మండిపడ్డారు. నిరసనగా ఎంఐఎం సభ్యులంతా సభనుంచి బయటకు వెళ్లిపోయారు.