హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ విధానాలతో రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు పెరిగి రైతులు, మిల్లింగ్ ఇండస్ట్రీ లాభపడుతుందనుకున్న దశలో కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. హైటెక్స్‌లో ఏర్పాటుచేసిన మూకాంబిక రైస్ అండ్ గ్రేన్స్ టెక్ ఎక్స్పోను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సరారు రైతులతోపాటు మిల్లింగ్ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. గతంలో.. ఎలా ఉన్నా ధాన్యం కొనుగోలు చేస్తామని తెలంగాణ, ఇతర దక్షణాది రాష్ర్టాల్లో బాయిల్డ్ మిల్లింగ్‌ను ప్రోత్సహించిన కేంద్రం, నేడు అవసరాలు తీరాక కొర్రీలు పెడుతున్నదని విమర్శించారు. పంటలను ఆదాయ మార్గాలుగా చూడకుండా ఎకువగా ఉన్న నిలువలను ఎగుమతి చేయాలని లేదా పేదలకు పంచాలని సూచించారు. మిల్లింగ్ ఇండస్ట్రీ సీ ఫారాల సమస్యలు, 99 కేవీ నుంచి 150 కేవీకి మార్చేందుకు సహకరిస్తామని చెప్పారు. త్వరలోనే ఈ సమస్యలపై సీఎంను కలుద్దాని హామీ ఇచ్చారు. సీఎంఆర్ సమస్యలను అధిగమించేలా మిల్లులను ఆధునీకరించుకోవాలని సూచించారు. అనంతరం రైస్ మిల్లర్ల ప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 3,037 మిల్లుల్లో కేవలం 375 మిల్లుల్లోనే ఫోర్టిఫైడ్ బ్లెండింగ్ మిషిన్లు ఉన్నాయని తెలిపారు. ఖర్చుతో కూడుకున్నా ప్రతి మిల్లును అప్‌గ్రేడ్ చేసుకుంటామని చెప్పారు.